Friday, August 5, 2016

మండుటెండలు మండించు  మద్దెనేల
స్వేదగ్రంధులు శ్రమపడి చెలగు వేళ
తెరపి యెరుగక వానలు చూరునుండి
కారు వంటిండనుండ సౌఖ్యమ్ము గాదె..




Wednesday, August 3, 2016

చివరాఖరుకు వాళ్ళ ఇంటిపురోహితుడు తేల్చి చెప్పేసాడట
కుర్రాడికి ద్వితీయ వివాహయోగం వుంది జాతకంలో ఇక మీ ఇష్టం అని
అమ్మాయిని అడిగారు యేంచేద్దాం? అని ఆందోళనాపధంలో ఊగిసలాడుతూ,,
ఆ అమ్మాయి ఒ చిరునవ్వును తల్లిదండ్రులవైపు విసిరేసి..
అయితే ఒక పనిచేద్దాం..అతనితో ముహూర్తం ఖాయం చేసేద్దాం..
అందరూ అవాక్కయ్యారు..ఎందుకలా మొండిగా ఆలోచిస్తున్నావ్?
యేం లేదు..అతనిది ఉద్యోగం గనుక నేను బ్రతికుండగా రెండో ఆలోచన వస్తుందనుకోను..నేను పోయాక అతనేమయితే నాకేంటి అంటాననుకున్నారా? అలా యేమీ అనబోవడంలేదుసుమా!!
నేను పోయాక నామీద మోజన్నా పెరగాలి,లేదా వివాహ వ్యవస్థమీద విరక్తయినా పుడుతుందిగాని అతనా ధైర్యంచేస్తాడనినేననుకోను..

ఇద్దరికీ మాంచి నడి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం సమయంలో
ప్రచండ భానుడి సాక్షిగా వివాహమయింది..

అప్పుడప్పుడూ ఉప్పూ కారాలూ తిరగమాత గింజల్లా పేలినా ఆ ఇద్దరూ
40 సంవత్సరాల పైబడి ఆనందంగా కలిసికట్టుగా కాపురం సాగించారు..

ఆవిడ అనుకోకుండా దాటిపోయింది మూడేళ్ళయింది..
జాతక చక్రంపట్ల వైముఖ్యమో ఆవిడపట్ల అస్తమించని అనురాగమో
అల్లానే ఒంటెద్దులా  బండినితోలుతూనే జీవన యానం చేస్తున్నాడు..
====================================================
అనురాగబంధాల ప్రహేళికలు[జీవన చిత్రాలు-2]
-------------------------------
ఆవిడకు గడుల నుడికట్టులంటే ఆరోప్రాణం..
ఆదివారం ఒచ్చిందంటే ఆవిడకోసం మాములుగా
ఇంటిదగ్గరకొచ్చే దినపత్రికలు గాక మరో మూడు
 దిన పత్రికలు రెండు వారపత్రికలు అదనంగా తెచ్చేవాడిని..
సోమవారం ఉదయమ్నుంచీ ఆకార్యక్రమంలోమునిగి తేఏల్ది..

బహుమతులు ప్రకటించిన ఒక వారపత్రికలో మాత్రం గడులునేనే పూర్తిచేసే ప్రయత్నం చేసే వాడిని..రెండు మూడు ఆధారాలు
కఠినమైతేవదిలేసే వాడిని..తను కొద్ది ఆలోచనలతోనే
ఆగడులను సునాయాసంగా పెన్సిల్ తోపూర్తిచేసి ఇక ఒకసారి చూసుకునిమీరుపంపించొచ్చునండీ! అనేది ఇలా ఈ అనురాగబంధం
దాదాపు మూడు దశాబ్దాలపాటు నిరాటకంగా సాగిందనే చెప్పుకోవాలి..అప్పుడప్పుడూ ఆ పజిల్ పూర్తిచేసినవారికి లాటరీలో తగిలితే 150 రూపాయలు బహుంతిగా వచ్చేవి ఆడబ్బులను మాత్రం తను అడిగిమరీ తీసుకునేది..ఆడబ్బులు ఓ పర్సులో దాచిపెట్టేది..

అలా ఇంకొన్ని గంటలలో  అసువులుబాస్తుందనుకున్నరోజు కూడా ఈనాడు
గడిని 90 శాతందాకా పూర్తిచేసింది..అక్కడది పోటీ పజిల్ కాదుగనుక భద్రంగ  ఇప్పటికీ దాచివుంచాను.
.మధుర స్మృతిగా....


ప్రతి ప్రభాతాన
నడక దారిలో
స్వాగతగీతాలు
 గానంచేసే పక్షిగణం
ఒక్కుదుటన పాడడం మానేస్తే
చిక్కబడిన నా గుండెకు సమాధానం
చెప్పుకోలేని అసమర్ధునిగా
అలమటిస్తూ కునారిల్లుతూ
 కాలం గడిపే నేను..