Thursday, January 29, 2015

అతన్ని గురించి ఎంతచెప్పినా
అది తక్కువనే అనిపిస్తుంది.

సమాజాన్ని శాసించేవాడు కవి
అనగానే సమావేశమందిరమంతా
కరతాళ ధ్వనులతో మార్మొగింది.

సమాజాన్ని శ్వా    కవి
అంగానే కత్తులు దూసే నేతలంతా
ముందువరసలోనిలబడి రణగొణ ధ్వనులతో
మందిరాన్నంతటినీ మలినం గావించారు
వారి వారి అరుపులతో అల్లర్లతో.

శాసించడం మేలా? శాసించడమా?
అన్నసంశయంతో సమాజం సత్తు రూపాయిగా
మారిపోతున్న సమాజం స్పందించిన దాఖాలాలేదు.

నాకు తెలీక అడుగుతున్నాను, అమాయకుడినే అనుకోండి

క  ళ్ళు తెరవడానికి కారణాలు 

వి  నిపించే ముందుచూపుగల క్రాంత దర్శిగదా కవి!!

=======================================
పవళింపు సేవ
==============
అనాదిగా భుజస్కంధాలపై
భారంగా మోసుకుంటూ వస్తున్న
దిగుళ్ళనన్నింటినీ ప్రక్షాళనం
పట్టుదలగా నిర్ణయించుకుని
అసంఖ్యాకంగా మధు పాత్రలను
ఖాళీ చేస్తూకాలాన్ని గడిపేసాము.
ఎంత అందంగా ఆనదంగాఉన్నదో ఈరాత్రి
అమృతమ్మా తనువులపై వర్షిస్తూన్నంత హాయిగా ఉంది.
 ఈ పందువెన్నెల రాత్రి సమయాన్ని ఈ పందిళ్ళక్రిండే
పవళించడం మేలని నిర్ణయించుకున్నాము.

మందు మోతాదు అధికమయిందేమో
మా తనువులు మాధీనంలో లేమని ప్రకటిoచాయి.
మా ఆజ్ఞలనూ ఆలకించము పొమ్మన్నాయ్.
ఇక ఆపర్వత సానువుల చెంతనే
పవళించాలని ప్రగాఢంగా భావించాం.
ధరణీ తలమే తలగడ కాగా
స్వర్గధామమే పరుపుగా ఊహించుకొని
ఒడలుమరిచి మరీ నిద్రించాము.
**********************************
LI PO-ఆంగ్ల కవితకు స్వేచ్చానువాదం
-------------------------------------------

Wednesday, January 28, 2015

ఆది అంతాలమధ్యన
---------రావెల పురుషోత్తమ రావు.
-----------------------------------------------

అభం శుభం తెలియని అమాయకుడిలా
చెట్టుకొమ్మకు చిక్కువడి గిల గిలా కొట్టుకుంటున్న
గాలిపటంలా   బాల్యం.

కొండమీదనుంచి జాలువారుతూ
నడిమయాన    లోయ దారిలో ఘనీభవించిన
జలపాతంలా యవ్వనం

నాలుగు బజార్లకూడలిలోనిలబడి
ఎటుపోవాలో దారితెలియక
నడమంత్రపు ఆలోచనలతో
ఉట్టికెగబ్రాగలేక కిందకు దిగ జారలేక
విచికిత్సలో ఊగిసలాడుతూన్న పాంధుడిలా
  నడిమివయసు కాలం.


రాలి పడడానికి సిద్ధమయి గతపుటూహల తలపులతో
శిశిర పత్రంలా చిరుగాలికికూడా వణికిపోతూ
అస్తమించేసూర్యునికి అభిముఖంగా ప్రాకులాడుతూ
ఆత్మబంధువులా,శేషప్రశ్నగా, మిడుకుతూన్న     వృద్ధాప్యం.
----------------------------------------------------------------


చరాచరం
=======
చలనం, నిశ్చలనం
రెండూ అర్ధరహితమే
ఇక చంద్రుడు వెలిగించిన
వెన్నెలకాంతిలో ప్రకాశించే
కొండలూ కొనలూ
పర్వత సానువులూ
ప్రచండవాయువు రాకకు
జడవడమంటూ ఉంటుందా?
రూప రహితమైన దాని రాక పోకా
క్షణభంగురమేకదా?

[జెన్ కవితలు చదివాక]

======================