Tuesday, April 7, 2015

ఋతుహేల
==========రావెలపురుషోత్తమ రావు.


నువ్వు వసంతానివా?
ఒక్క సారి ఆమని గీతాన్ని
మ్రోడు వారిన జీవలతిక
చిగురించేలా అమృతవర్షిణివై నర్తించు.


నువ్వు గ్రీష్మర్తువువా
పగలల్లా ప్రచండభానుడై
వడగాలులు విసిరినా
చీకటిపడే రాత్రికి
విరబూసిన మల్లెవై
నా మనసు నాహ్లాదపరుచు.

నువ్వు వర్ష రుతువు  వా!!
పంటపొలాలలన్నింటినీ
బీటలు వారి బీడుభూములుగా 
మారకుండా కరుణామృత హృదయంతో
ఆకాశాత్పతితం తోయన్న రీతిలో
సకాలంలో నీటినిప్రవాహాల్లా  పారించు.



నువ్వు శరదృతువ్వా
పిండారబోసినవెన్నెలను
రంగవల్లిగా 
నా నిజగృహప్రాంగణంలో
నిండు మనసుతో వెలయించు.
నువ్వు హేమంత శార్వరివా?
చలిగాలులన్నింటినీ
చిరుజల్లుగా మాత్రమే కురిపించు.




నువ్వు శిశిరానివా?
నాజీవన ప్రస్థానాన్ని
వర్ణశోభితం చేయగలిగినా
శీర్ణమయే దిశ సంప్రాప్తించకుండా
సానుభూతితో సం రక్షిస్తూ  దీవించు.
----------------------------------

No comments:

Post a Comment