Saturday, April 11, 2015

రమణీ యార్ధ ప్రతిపాదిత శబ్దం---
----------------రావెల పురుషోత్తమరావు
----------------------------------------------

కవిత్వం గుబాళించడానికి
కలమూ కాగితం మాత్రమే సరిపోవు
స్పందించే హృదయం కావాలి
పాఠకుడి గుండెను ఒడిసిపట్టగల
చేతాళం ముఖ్యంగా అవసరమౌతుంది..


మనిషిని కట్తి పడేయలేని
మౌన ముద్రలు యే మాత్రంచెల్లుబాటుకావు
సమకాలీన సమాజాన్ని
సహృదయంతో విశ్లేషించగల సమున్నతగా
మూర్తీభవించే వీలుదొరకాలి.


భావశబలత ససేమిరా సద్య:  స్ఫూర్తితో
 సహకరించే వీలునందివ్వదు.
పదాలపోహళింపులో ప్రావీణ్యం ఉట్టిపడాలి.
అంత: చేతనతో అవకాశాన్ని
అందిపుచ్చుకునే అనుభవం తోడవాలి.

అప్పుడే సుమా కవిత
పూలపరిమళంలా గుబాళిస్తుంది.

శబ్దానికీ అర్ధానికీ సం యోజనయేర్పడి
శరసంధానపు బిగువు ఇట్టే సంప్రాప్తిస్తుంది.
రమణీయార్ధ ప్రతిపాదితమై ఆ కవిత
చిరకాలం చిరంతనంగా శోభిల్లుతుంది.
==============================

No comments:

Post a Comment