Thursday, April 2, 2015

తేనెల తేటల మాటలతో---
-------రావెల పురుషోత్తమ రావు.
================================

ఏప్రియల్  నెలంతా
కవితా మహోత్సవమే
ఎవడు రానన్ను
ఫూల్ చెస్తానంటున్న వెధవాయ్?
----------------
మనలో వెధవాయిత్వం
తగ్గించడమే మేలు
రోజుకో కవితన్నా
గిలకండిక చాలు.
-----------------
కవిత రాయడమంటే
మనిషిని చదవడమే
మనసనే పలకపైన
అక్షరాలు దిద్దడమే
---------------------
ఇంకో సారి ఇంకో సారి
తిలక్ ను బాగా చదువు
అనుభూతి సారాన్ని
గుండెలోకి పంపుకో
-----------
స్నిగ్ధ సౌందర్యమంటే
సి.నా.రె కవిత
వెన్నను చిలికించే
కవ్వముంటుంది వెదుకు.
----------------
శివారెడ్డి కవితలన్నీ
శిరోధార్యం చేసుకో
మట్టివాసన ఒలుకుతుంది
గట్టిగా ఒడిసి పట్టుకో
------------
పఠాబి పన్ చాంగం
మరోసారి చదువుకో
మణిప్రవాళ శైలిని
మనసునిండా నింపుకో
--------------
మరోసారి  మహా ప్రస్థానం
బాటమీద నడచిపో
అధోజగత్సహోదరుల
ఆక్రందన తెలుసుకో.
-------------------
ఆవంత్స సోమసుందరుడిని
అవలీలకాదు చదవడం
వజ్రాయుధమంటే
నిర్వచనం తెలుసుకోవడం
------------------

త్వమేవహమనగానే
ఆరో రుద్రుడి స్వప్నం
పెన్నును గన్నుగా జేసి
మాంచి దన్నుతోడ పేల్చడం.

-----------------
వచనకవిత అంటేనే
వావి వరుసలు వెదకడం
'తెలంగాణా' కావ్యంతో
కుందుర్తిని తవ్వడం.
----------------------
శివసాగర మధనంతో
విప్లవాన్ని శోధించు
దిగంబర కవిత్వంపై
దృష్టి బాగ సారించు.
---------------------------------------
కవితా వ్యాసంగమంటే
వొడలువంచిచేసే   సాగుబడి
ఉంటుందా పిచ్చివాడా?
నిముసమైనా తీరుబడి
------------------------
ఆదికవినుంచి ఆధునికునిదాకా
కవిత్వాన్ని వల్లించి జల్లించు
మేలురకం విత్తనాలతో
పంటల అధిక నాణ్యతను  సాధించు.
------------------------------2-4-15





No comments:

Post a Comment