Friday, April 24, 2015


సంతోష శరణం---
------------------
బాధే ,  జీవితానికి
పర్యాయ పదంగానో
ప్రతిపదార్ధంగానో
పరిణమించినప్పుడు
కనులకు నిద్ర దూరమై
కలత పెడుతూ వుంటుంది.

రేయింబగళ్ళూ
శ్రమించే
స్వేదాశ్రయులకు
గాఢంగా అదే నిద్ర తన్నుకొచ్చి
తగుదునమ్మా అంటూ కనుకొలకులపైనే
నాట్యంచేస్తూ
ప్రభాతాన రెల్లుపూల కాంతులు
భుజంతట్టిలెపేదాకా
ప్రక్కమీదనుండి కదలకుండా
కట్టిపడేసి
కంటికి రెప్పలాకాపాడుతుంది.


మనిషికీ,మనసుకూ క్రమేపీ
బంధం తెగిపోతున్నప్పుడు
జీవాతువే నిర్జీవమై
నిరాశా నిస్పృహలను
 నిండుకుండలుగా జేసి

ముఖద్వారం ముందు
 గుంభనంగా నిలిపి
నిరాశ్రయురాలిగా నిష్క్రమిస్తుంది.

కలత బారిన మనసుకూ
కలలుగనే మనిషికీ
ఆత్మీయతానుబంధం అన్యోన్యంగా
కొనసాగుతున్నాంత కాలం
అమృతం, రాత్రీ పగలూ
వైవిధ్యం చూపకుండా వర్షిస్తూ
నిత్య వసంత శోభను వాకిలిముందు
తోరణాలుగా కట్టి ఆ ఇంటిని నిత్యహరితనుగాజేసి
శుభాశీస్సులనందిస్తూ
సుతారంగా నిష్క్రమిస్తుంది.
---------------------------------------

No comments:

Post a Comment