Sunday, April 19, 2015

కన్నీటి కావ్యం
-----------------రావెల
ఉప్పగా ఉన్నా చప్పగాఉన్నా
ప్రతి కన్నీటిబిందువుకూ
సింధువంత  కధ వుంటుంది.

పుత్ర  శోకం యేడిచే కన్నతండ్రి
కన్నీటికి సముద్రమంత
లోతుగా  అగాధమై గోచరిస్తూ
అనితరసాధ్యమై సాక్షాత్కరిస్తుంది.

కన్న సంతానాన్ని  అకారణంగా
అకాలమృత్యువుకు   పోగొట్టుకున్న
కన్నతల్లి కడుపుకోత
బంగాళా ఖాతంకన్నా
బాధాకరమై దిగులుతోనిండిన
మాహాసముద్రమై   ఘో షిస్తుంటుంది


పేదరికంతో ప్రతినిత్యం వేగలేనంతగా సతమతమవుతూ
పిల్లలకు కడుపునిండా అన్నంపెట్టలేని
తల్లి దు :ఖం తరతమ బేధాలతో
సాపత్యంలేకుండా సంతాపంతో ఎగసిపడుతూ
విలపిస్తూ విషణ్ణవదనంతో వేడెక్కుతూ
విహాయసంలోంచి ఊడిపడే జీవనదిలా
విలువైన కాలాన్నంతా విచారంతోనే గడిపేస్తుంది.

ఇంకా సూర్యకిరణాల చురుక్కులను  
స్పృశించే అదృష్టానికికూడా నోచుకోలేక
తల్లి గర్భం నుండే భ్రూణ హత్యకు గురై
పిండం   రూపంలోనే పిండప్రదానం
 పెట్టించుకున్న  శిశువుకోసం
గుండెలవిసిపోయేలా సమకాలీన సమాజాన్ని
దూషిస్తూ దుర్మార్గపు  ఈ కృపారహితపు
 జగతినంతటినీ కడుపారా  శపిస్తూ
సానుతాపం చూపే దిక్కుకూడాకనరాక
సాగరమధనంలో వెలువడిన గరళా న్ని కంఠసీమలో
దాచుకున్న హరుని కన్న అధికంగా ఆక్రోశిస్తుంది.

అమానుషంగా తనమానాన్ని మృగాడి
కామప్రకోపానికి ఎరగామారి కొల్పోయిన
మానధనాన్నీ యశోకీర్తులనూ
తిరిగిపొందలేనన్న దురదృష్టానికి
జీవితాంతం అలిపీఠంపై   సాగిలబడిపోయివిలపించే
అమాయకమైన ఆడపిల్లల  అనుతాపాన్ని
సాధికారంగా మూల్యాంకనంజేసి
ఖరీదుకట్టగల షరాబులెక్కడ?
==========================




No comments:

Post a Comment