Monday, February 23, 2015

కమ్మని కలల కళాఖండం--
-----------రావెల పురుషోత్తమ రావు.
**************************************

ప్రతిరోజూ సమయం మీరకుండా
ఇంటికి తిరిగొస్తున్నప్పుడు
వీధి మలుపులోనే
విరజాజి పూవులా గుబాళించే
సురబిళ పరిమళం అమ్మ.

ఇంటికి చేరువవుతుండగానే
మరువంలా, దవనంలా గట్టిగా
 భుజ తట్టి ఈలోకంలోకి గట్టిగా
లాగి ఈడుకొచ్చే దివ్య స్వరూపం.

ముఖ ద్వారం దగ్గరే నిలబడి
ముసి ముసి నవ్వుల నదిలో
ముగ్ధ మనోహరంగా ప్రవహించే
పూల పడవ

నేను ఇంటిపట్టున ఉన్న నాల్రోజులూ
స్వేద సంద్రమై సాక్షాత్కరించే
కమ్మని పిండి వంట.

అమ్మంటే నాసికా పుటాలచెంత
పట్టు విడవకుండా పట్టి వుండే
ఇంగువ సువాసన.

చేదు అనుభావాలను గుండే గొంతుకలోనే
కట్టి పడే సి కదలాడే
కమ్మని దేవతా మూర్తి అమ్మేగదా!

నేను మళ్ళీ తిరిగి పెద్ద చదువులకై సాగిపోతుంటే
కన్నీటికడలియై ఆత్మీయతాక్షలను
శిరసుపై రాలుస్తూ చిరంజీవ అంటూ
దీవించే దివ్య భావనా మధు కలశం.

ఆరోగ్య సూత్రాలను వేద పనసలా
వల్లించే ఘనా పాఠి గదా అమ్మంటే.
చదువులు పూర్తయిన వెంటనే
ఉద్యోగం వచ్చినదని చెప్పగానే
మొదటిజీతంతో నీకు నప్పే మంచి బట్టలు కుట్టించుకుని
ఆఫీసుకు అందంగా తయారయి వెళ్ళుతుండమని
పదే పదే విన్నవించే విన్నాణ సర్వస్వం అమ్మ.
----------------

[ ఊహలంటూఊపిరి పీల్చుకోని   చిరు ప్రాయంలో
మా అమ్మనూ ,సంతోషం ఆకాశమంతటా అల్లుకుంటూ
తారా స్థాయికి చేరుకునే సమయంలో
నా పిల్లలకు తల్లిగా తనివి తీరని
ప్రేమామృతాలను వర్షింపజేసిన వాళ్ళ
 అమ్మనూ నా జీవిత భాగస్వామిగా
ఇంట్లో ఆనందోపదేశయుజే అన్నట్లు నందనవనమై ప్రభవించి
కనుమూసి తెరచేలోపు  దూర దూర తీరాలకు
ఆ సర్వమంగళ స్వరూపాన్ని సాగనంపుకున్న
మా దురదృష్టానికి పదే పదే విలపిస్తూ--]
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^23-2-15

No comments:

Post a Comment