Friday, February 27, 2015

సుమవిలాపం
-------------------

అవును నీవన్నది నిజమే
నేను కేవలం ఓ గడ్డిపూవునే
ఏ వాసనా వెలయించలేక
తిరస్కారానికిగురౌతున్న
ఓ చిన్ని గడ్డిపూవునే.

కానీ నాకో హృదయముందనీ
దానికీ బాధాతప్తమైన
పొరలుంటాయని ఎంతమందికి తెలుసు.

ప్రభాత సమయంలో పార్కుల్లో పరుగెట్టే
ఆరోగ్యంపై అతి శ్రద్ధవహించే పాదచారుల
పదఘట్టనలక్రిందో పశువుల పరాన్ముఖత వల్లో
మా వూపిరి గాలిలో కలిసే దిశలో
అభద్రతాభావంతో అరక్షణీయమై
ఊగిసలాడుతూ వుంటుంది.

ఎవరూ అయ్యో పాపం చిట్టి ప్రాణం
 గిజ గిజ లాడుతుందని
జాలితలచి కన్నీటిబొట్టును రాల్చగాగలిగిన
కృపాదృష్టికెవరికుంటుంది  చెప్పండి?

కవుల క్రాంత దర్శనలో కనిపించాను గనుక
కనీసం అక్షరబద్ధమై పరోక్షంగానైనా
కొందరు మమ్మల్ను గూర్చి
ఆలోచించే అవకాశం లభించింది.

లేకపోతే ఇలా అనామకంగా
అమాయకమౌ  మానస సంఘర్షణలో
పడి నలుగుతూ  నాలుగు కాలాలపాట
వేదనాతప్త హృదయంతో

కాలం వెళ్ళదీయాల్సి వచ్చేది.కన్నీటికడలిలో పడికొట్టుకు పోయి
 చరిత్రహీనులుగా మిగిలి శేషజీవితాన్ని
 విషణ్ణ వదనంతోగడపాల్సి వచ్చేది.
********************************

No comments:

Post a Comment