Friday, February 13, 2015

తెలుగు నాట వెలసిన  శతక నందనోద్యాన వనము

____________________________________
శతకమనగా నూరు పద్యముల సమాహారం
.సామాన్యముగా శతకములలో 108 పద్యములుండుట వాడుక.
దీనికి కారణమిట్లూహింపనగును.భగవంతుని పూజా విధానములలో
అష్టోత్తర శతనామములకు అధిక ప్రాధాన్యమము నిచ్చుట మన సదాచారము.భగవంతుని స్మరణములోవలెనే ముఖ్యముగా భక్తి
ప్రధానముగా వెలువరించుటకు అలవాటు పడిన మనమునూ ఆ సత్సాప్రదాయమునే పాటించుట 
శుభకరమని భావించి అది నియమముగా పాటించుట ప్రారంభమై తరువాత అన్ని శతకములకూ విస్తరించి ఉండనోపు.

శతక నందనోద్యాన వనములో తొలిసుమమును పూయించిన ఘనత,శైవ  వాౙ్మయమునకు విజ్ఞాన పీథముగా నెన్నదగిన 
పాల్కురికి సోమనాధునిదే యనుట నిర్వివాదాంశము.ఇదియే వృషాధిప శతకము.
12 వ శతాబ్దమునకు చెందిన మల్లికార్జున పండితారాధ్యుని "శివతత్వ  రము" తొలి శతకముగా కొందరు భావించిననూ ,
శతకరచన యందు ప్రాధమిక నియమములుగా గల[1] మకుట నియమము,సంఖ్యానియమము ఇందు కనపడకపోవుటచే 
విజ్ఞులు దీనిని అంగీకరింపలెదు.ఇందు శివ యను మకుటమున్ననూ అది నియమిత  స్థా నములో ఉపయోగింప బడలేదు.
సంఖ్యానియమము జూచిన ఇందు మూడు వందలపైన పద్యములుండుత గ్రహించనగును. వృషాధిప శతకమున పద్యములు 108 గానూ
 బసవా బసవా వృషాధిపా యన్న మకుటము నియత స్థానములో కూర్పబడినది.
వీర శైవ మత స్థాపకుడైన బసవేశ్వరుని సంబోధించు కవితాధార ఇందు ప్రకటితమై స్వీయాను భూతి విషయకమై 
సదా సర్వదా స్ఫురించుట గమనించ గలము.

శివ భక్తి ప్రధానముగా వెలువరింపబడిన ఇతర శతకములలో ముఖ్యముగా నెన్నదగినది యధావాక్కుల అన్నమయ్యకృత  "సర్వేశ్వర శతకము".
గొదావరీ తీర ప్రాతమైన పట్టిస క్షేత్రమునందలి వీరభద్ర స్వామికత్యంత భక్తుడైన ఈ అన్నమయ్య
శ్రీశైలమును సందర్శించబోవుచూ,కృష్ణా నదీ తీరమున ఈ శతకము వెలువరించెనని ప్రతీతి.
తరువాత ఈ ధారలో నెన్నదగినది,శ్రీ కాళ హస్తీశ్వర సతకము.ఈ శతక కర్త విషయమున కొంత వివాదాస్పదమైన 
చర్చ జరిగిననూ,ఇది శ్రీకాళ హస్తి మాహాత్మ్యము రచించిన ధూర్జటిదేనని నమ్మదగును.
ఈ శతక పద్యములందలి భావ పటిమ, ధారా శుద్ధి శ్లాఘి0పదగినవి.ఈ తర్వాత శివ పారమ్య బోధకములై 
ఎన్నదగిన శతకములంత గా  లేవనియే చెప్పనగును.

విష్ణు భక్తి ప్రబోధకములైన శతక సంపదలో నతి ప్రాచీన మైనది దేవకీ నందన శతకము.
ఇందలిపద్యములు శ్రీకృష్ణ పరమాత్ముని లీలా విహారములను వివరించుచూ ,విష్ణు మహిమాదికములను ప్రశంసించుచూ
 అటనట కృష్ణ కర్ణామృతముననుసరించి పద్యములు కొన్ని వ్రాయబడినట్లుగా తోచ. లభ్యమైన గ్రంధమందు ఫలసౄతితోగలిపి 
100పద్యములు మాత్రము గలవు. జక్కన విక్రమాదిత్య చరిత్ర ఆధారముగా దీని కృతికర్త హరితస గోత్రీకుడకు జన్నమంత్రిగా కనుపట్టు ను.
  
సుకరంబై,సురసేవ్యమై,సులభమై,సువ్యక్తమై యుక్తమై 
 ప్రకటంబై పరమార్ధమై,ప్రమదమై,ప్రద్యోతమై,పథ్యమై
 యకలంకామృతమై యమోఘతరమై యానందమై
  సకలబున్ భరియించునీకృపయె, కృష్ణా దేవకీ నందనా!

అలాగే మరియొక పద్యం

అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై,గుబ్జపై
నరుపై, ద్రౌపదిపై గుచేలుపై యన్న0ద వ్రజ స్త్రీలపై
పరగంగల్గు భవత్కృపారసము నాపై గొంతరానిమ్ము మీ
చరణాబ్జంబుల నమ్మినాడ , హరికృష్ణా దేవకీ నందనా!

నారాయణ శతకమునందు నారాయణుని మహిమయుశ్రీక్జృష్ణుని బాల్యలీలను 
ముద్దులొలుకు మృదుమధురమగు పద్యములలో వతనవి. సూక్ష్మములో మోమన్నటులీ గ్రంధములు చిన్నవైననూ అద్వైత మత సంప్రదాయములగు 
తత్వరహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తీర్చి దిద్దబడినవి.ఈశ్వర తత్వనిరూపణము గురూపదేశము వలన
మోక్ష ధర్మములను గ్రహించు విధమిందు మనోహరముగా వర్ణితమైనది.

నాతికఠినములైన సమాసములు చక్కని శబ్దాలంకార శోభితములైరసవత్తరమగురచనా ప్రతిభ గలిగినది
 ఒంటిమిట్ట వీర రాఘవ శతకము. 
దీని కృతికర్త రామాభ్యుదయ కర్త యగు అయ్యలరాజు రామభద్రునికి ముత్తాతయని వీరేశలింగముగారు వ్రాసియున్నారు.


కంచెర్ల గోపమంత్రి విరచితమై జనావళి నోళ్ళలోనానిన శతకము దాశరధీ శతకము.కంచెర్ల గోపమంత్రియే రామదాసు.

శ్రీరఘు రామ చారు తులసీ దళ ధామ శమక్షమాదిసృం
 గార గుణాభి రామ త్రిజగన్నుత శౌర్యలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారక రామ భద్రగిరి దాశరధీ కరుణా పయోనిధీ!

 భక్తి రసస స్ఫోరకములైన శతకములలో ఎన్నదగినవెన్నో గలవు
అందున కృష్ణ శతకము,రంగ సాయి సతకము,వసుదేవనందన శతకము,సూర్యనారారాయణ శతకము లక్ష్మీ శతకము, 
నృసిం హ శతకము, యాదగిరీంద్రశతకముముఖ్యమైనవి.

ఒక తరము క్రింద ప్రాధమిక పాఠ శాలల స్థాయిలోనేదాశరధీ శతకము, భాస్కర్శతకము,
శ్రీక్రిష్ణశతకము,కుమారీ శతకము,వేమన సుమతీ శతకము, కుమరా శతకములు వల్లె వేయించు 
నాచారముండెదిది. ఆ స్థాయిలో మనస్సుపై అత్యంత గాఢమైన ముద్రనిడిన ఈశతకములు  జీవన మార్గమున 
ఒడి దుడుకులన్యు తట్టుకోగల మనూధైర్యము కలిగించు ప్రభావము గలవి.ఆధ్యాత్మిక పరమైన అంశముల మాటున జీవన శైలిలో
కొంత మనోనిబ్బరము గల్గించు సాధనములుగా ఈ శతకములు
పేరెన్నిక గన్నవనుట నిర్వి వాదాంశము.

ఆ తర్వాత ఆధునిక కాలమునభక్తి రసప్రధానమగు శతకములు వేల సంఖ్యలో వెలువడినవి. 
అన్నింట మిన్నగా నెన్నదగినవి,కవిసామ్రాట్ విశ్వనాధ వారి శతకరచనప్రశంసార్హమైనది.
క్రీ శ 950 వ ప్రాంతములొని  యుద్ద్ధమల్లుని బెజవాడ శాసనములో సకృత్తుగా గానుపించి, 
తరువాత నన్నయ గారి భారతాంధ్రీకరణమందు అటనట చోటుచేసుకున్నమధ్యాక్క్కర వృత్తమును 
స్వీకరిమితరువాతికవుల ఆదరణందుకొనక అది విశ్వనాధవారి చేతిలో శతసహస్రముగా ఆవిష్కృతమగుట, విశేషముగా పరిగణింపదగును.


 శ్రీ విశ్వనాధ వారు శ్రీశైల మల్ల్లిఖార్జునునిపరముగా శ్రీగిరి సతకము ,ద్రాక్షారామమునందలి భీమేశ్వరుని పరముగా ద్రాక్షా రామశతకము,
నిత్య కల్యాణ  గుణ ధాముడు సప్తగిరి వాసుడైన శ్రీ వేంకటేశ్వని స్తుతించుచూ,శేషాద్రిశతకము , 
ఇవిగాక శ్రీకాళహస్తి శతకము,భద్రగిరి శతకము,కుల స్వామి శతకము,సంతాన వేణుగోపాలుని పరముగా నందమూరు శతకము, 
నెకరుకల్లు  శతకము,మున్నంగి వేణుగోపాల శతకము,రాజరాజేస్వరుని పరముగా వేముల వాడ శతకము చెప్పి వెలువరించిరి. 
శ్రీ విశ్వనాధ వారి తాత్విక భావ సంపదకు ఈ శతకములు దర్పణములుగా నిలిచిన వనుట అతిశయోక్తి గానేరదు.
ధార్మిక ప్రబోధకమునకు శతక పద్య రచన లు చక్కని వాహికలు. ధారా శుద్ధి గలిగిన విమలచిత్తులగు 
కవులకు ఈశతకరచన దుష్కరమైన కార్యము కాదుగదా!


తేట తెల్లమగు భావప్రబోధకములగు శతకములను వెలువరించదగిన ఆవశ్యకత  నేడుఎంతయో గలదు. 
అటుపై లభ్యముగానున్నపూర్వకవికృతమైన శతక పఠనమీ కలికాలమునండు మనసు కూరట కలిగించుటయేగాక,మనసులను 
ధార్మికచింతనవైపు మరలించగలుగుట శ్రేయోదాయకమూ ఆరోగ్య ప్రదమైన సంగతియేగదా!



ఆనాడు శివకవులు తెలుగు సాహితీ నందనోద్యానవనమున పూయించిన శతక సుమములు 
నానాటికీ వెలలేని రత్నములై భాసించుట మన అదృష్టమునకు తార్కాణమేగాక వేరు గాదని మనవి.
ఇట్టి అదృష్ట సంపదను మనమూ ప్రతినిత్యమూ వల్లె వేసిన  మన దేవతలను నిత్య పారాయణ 
ద్వారా తలచుకొని ధ్యానించు పుణ్య కార్యము మనలను శాంతి మార్గము వైపు తరలించుట శుభోద్కరమేగదా!
**************************************************************

[మార్చి 1976-సప్తగిరి సంచికలో వెలువడిన వ్యాసమునిచట భక్తి ప్రపత్తులతో నందించుట జరిగినది. ]

---------------------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment