Sunday, February 8, 2015

శూన్య పరిధి----రావెల పురుషోత్తమ రావు.
-------------------------------------------

శూన్య పరిధి విస్తరిస్తున్నంతకాలం
సుఖ సంతోషాలతో సాగుతున్న జీవయాత్ర
మృగ తృష్ణల వెంట పరుగులతో కూలబబడి
ముగిసిపోయే ప్రమాదం ముంచుకు రావడం ఖాయం.

ముక్కారు పంటలుపండే పంట పొలాలపై ఇప్పుడు
పాశు పతాస్త్ర ప్రయోగం జరిగి పోయినట్లున్నది.
ఇకపైన పల్లెతల్లిని సుమంగళిలా తీర్చి దిద్దే
పచ్చల హారం పరశు రామప్రీతి కావడం తప్పదనిపిస్తున్నది.

ఆస్థానంలో ఆకాశహర్మ్యాలతో కాంక్రీటు వనాల భవనాలు
ఇబ్బడి ముబ్బడిగా రానున్నాయి.

పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినా,మనుషుల మనస్తత్వంలో
కించిత్తు మార్పూ రాకపోవడం మనదురదృష్టమేనేమో ననిపిస్తున్నది.
మకిల బట్టిన వారి వారి మనసుల్లో 
దయాదృష్టి కొరవడినట్లే కనిపిస్తున్నది.

వసంత కాలపు రంగు రంగుల ఆమ్ర శోభ ఇక  పై
వర్ణనీయ వస్తువుగా సాహితీ సంపదలో
మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తున్న దాఖలా
ముందున్న ముసళ్ళ పండుగలో  గోచరిస్తున్న్నది.

వ్యవసాయం, సాగుబడీ ఇక పురాతన వస్తు  శాలల్లో
ప్రదర్శనా వస్తువుగా తీర్చిదిద్ద బడటం తప్పదనిపిస్తున్నది.
పంటపొలాలపై నుంచి వీచే పైరగాలులు
ఇకపై ఇక మరో మహా ప్రస్థానం దారిపట్టడం తప్పదులాతోస్తున్నది.

పచ్చని పైరు శాఖలపై వాలవలసిన పక్షి సమూహం
స్మశానపు దారులను వెదుక్కోవలసి రావడం కడు శోచనీయం కాదా?

ఇక పంచాం గాలన్నింటినీ ఈప్రాంతాల్లో ప్రవహించే నదీనదాల్లో
నిమజ్జనం చేయడం మాత్రం మరువకండి.
వార ఫలాలు ఇకపై అందని ద్రాక్షల్లా
అపురూపమవుతూ అదృశ్యరూపం దాల్చనున్నాయన్న సత్యం
అందరినీ కలవరపెట్టి కలవళపెడుతున్న తీరు బాధ కలిగిస్తున్నది..

మంచి చేస్తాడని మనసారా నమ్మిన వాడే 
నిలువునాముంచేస్తుంటే విస్తరిస్తున్న ఈ శూన్యపరిధి
వైభోగాలను వైధవ్యానికి చేరువగా చేర్చడం ఖాయమేగదా!

-----------------------------------------------------------------------------------7-2-15

No comments:

Post a Comment