Tuesday, February 17, 2015

రాజకీయానికే   రాచపుండు పుట్టినట్టుంది.
-----------------రావెల పురుషోత్తమరావు.

మనిషికులానికేదో  గత్తరొచ్చినట్లుంది.
మన్ను దిన్న పాముల్లా ముసుగు కప్పుకుని
దీర్ఘ నిద్రలోకి జారుకుంటున్నారు.
తెలిసిన వాళ్ళుకూడా తెలియనట్లే
తోటివారనికూడా చూడకుండా
కప్పదాటుగా  దాటుకుంటూ నడిచిపోతున్నారు.

మనిషి జాతికేదోగత్తరొచ్చినట్టుంది.
నెత్తురునుడికించే వార్తలను చూసినా
చిత్తుగా తాగి పడుకున్న 

పానశాలలను గట్టిగా పట్టుకుని 
వదలనంటున్న బానిసల్లా
బరితెగించి మరీ ప్రక్కకు 
తప్పుకు పోతున్నారు.
యేఒక్కరికీ ఆవేశం ఒక్క ఆవగింజంతైనా 
ఉబికి పైకి తన్నుకొస్తున్న దాఖలా కనిపించడమేలేదు.

మానావాళికంతకేదో పుండుబుట్టినట్టుంది.
మనహక్కులు హరిస్తున్నారని
కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా
క్రూరంగా వాటిని కర్కశపు ధోరణిలో
కాలరాస్తున్నారని తెలిసినా
కుంభ కర్ణుడి వారసుల్లా
మౌన ముద్రను వీడడంలేదు.
నిద్రాదేవత బిగికౌగిలిని
వదలి బైట పడలేకపోతున్నారు.
మనమనుగడకే ప్రమాదం 
వాటిల్లబోతున్నదని తెలిసినా
మగత నిద్రలోనే ఇంకా జోగుతున్నారు.
-----------------------------------------------------15-2-15

No comments:

Post a Comment