Tuesday, March 10, 2015

ఆగామి వసంతానికి---
---------------------

నిన్నటినుంచీ ఎడతెరిపిలేకుండాకురిసిన హిమపాతం
భూ వలయాన్నంతటినీ మంచుదుప్పటితో కప్పినట్లయింది.
యావత్ భూ ప్రపంచమంతా ఉప్పిరిసి ఘనీభవించిన సంద్రంలా
మీద పరుచుకుపోతున్న సూర్య కాంతులతో ధగ ద్ధగాయమానంగా
మెరిసిపోతూ ఆగామి వసంతానికి నేపధ్యం తయారుచేసుకునే దిశలో

అందిపుచ్చుకున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకున్న తీరు
వాస్తవంగా ప్రశంసార్వమై కనులకు మిరుమిట్లు గొలుపుతూ
కళాత్మకమైన అత్యాధునికకళాఖండంలా  మురిసిపోతున్నది.

రాబోయే రోజుల్లో కాలం గీయ తలపెట్టిన హరితవర్ణ శోభను
మరింతగా ద్విగుణీకృతంచేయాలనీ నగ్నంగా నిలుచున్న శిశిర తరువు
రాబోయే వసంతం అందించే  రాజసాన్నూహించుకుని మెరుపులపూల దండగా
 తనను తాను మలచుకుంటూ ధన్యోస్మి అనుకుంటూ దరహాసంతో మెరిసిపోతున్నది,

మావిచిగురులు కడుపారా తింటూనే కోయిలమ్మ కొత్తపాటలు పాడడానికి 
గొంతును సవరించుకుంటూ కాకోలుకీయంగా కాకమ్మను 
తెరవెనుకకెళ్ళమని సఙ్జలు చేస్తూ  సహరించమని శాసనాలతో హెచ్చరిస్తున్నది.

రాబోయే కవిసమ్మేళనంలో ఆహుతులైన సభాసదులు తలలూచి తరించేలా
తాను చదివే కవిత గుండె గుండేకూ గుమ్మానికి కట్టే మావిడి తోరణంలా 
శుభాలతో తేలిపోయే లేఖార్ధంలా మిగిలిపోవాలని కాగితాలను
దస్తాలు దస్తాలుగా ఖరాబు చేస్తున్నాడు.సాంకేతిక పరిజ్ఞానాన్ని
సన్నిహితంచేసుకోలేని తన అసమర్ధతను తానే విమర్శించుకుంటూ
మున్ముందుకు తాను తీసుకుపోబోయే తీర్మానాలకు నేపధ్యాన్ని తనకనుకూలంలా 

మారిపోవాలని మధురమైన స్వప్నాలనుకంటూ ముచ్చటపడుతూ 
ముసి ముసినవ్వులతో ముందుకు సాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో 
తలమునకలుగా శిరోదఘ్నంగా ఆలోచనా సంద్రంలో మునిగి గగన మార్గంలో ఊహలను గాలిపటాల్లా ఎగరేస్తూ తుళ్ళింతలతో కవ్వింతలతో తూర్పున త్వరత్వరగా ప్రభవించాలని
ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నాడు.కవి వసంతుడు సమధికోత్సాహసంతో
ఆగామి వసంతానికి , గ్రహగమనం ఎలావున్నా , తన పంచాంగ శ్రవణం ఇటు  జనతకూ 
అటు ప్రభుతకూ,  కంటకప్రాయంగా తయారవకూడదని పురోహితులవారు 
ప్రతినిత్యం తన  కులదైవానికి విన్నపాలరూపంలో విన్నవించుకుంటూనే వున్నాడు.

ఆగామి వసంత యామిని ఆగమనానికి ముందస్తు ప్రణాళికలు  తయారవుతున్న తీరు 
నెమళ్ళనుసైతం కొత్త భంగిమలను నేర్చుకోమని హెచ్చరిస్తున్నట్లే వుంది.
------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment