Sunday, March 22, 2015

తెలుగు పలుకుల శుభ  తోరణాలు
==========================

ఉగాది వచ్చిందిగదా అని ఉత్సాహ భరితంగా
ఇక్కడి ప్రవాసాంధ్ర ఉత్సవాలకు వెళ్ళి వచ్చేసాను.
సభాసదులందరూ సంప్రదాయాన్ని
ఇష్ట పడుతూ కొత్త దుస్తుల్లో నయనానందకరంగా
వచ్చారు.నిర్వాహకులూ విచ్చేసిన అతిధులూ మాత్రం
సూట్లూ బూట్లలో విచ్చేసి ఆంగ్లంలో
తడబడ కూండా తమ శుభాకాంక్షలను
యదావిధిగా కరతాళ ధ్వనులమధ్య అందించారు.
యవ్వనంతో మిసమిసలాడే యువతీ యువకులు
 ప్రత్యక్షంగా "కెవ్వు కేక" లాంటి శబ్ద నాదాలను

ప్రతిధ్వనించేపాటలతో అలరించాలని ప్రయత్నించడానికి
వేదికపై నృత్యాలతో  లేని దుమ్ముమంతా  దులిపారు.
ఇంతలో తెలుగు సరిగ్గా  చదవలేని మా మనవరాలు
"తేనెల తేనెల మాటలతో మన దేశమాతనే కొలువండి"
భావం భాగ్యం చూసుకుని ----   అని ముద్దు ముద్దుగా పాడితే
అందరూ ఆనందంగా నిలబడి మరీ ఆ చిన్నారిని
మనసారా ఆశీర్వదించారు.తెలుగు తనం ఇంకా
చెక్కు చెదరలేదని చెప్పడానికి సోదాహరణంగా

మా మనబడి పిల్లలు సుమతీ వేమన శతకం పద్యాలతో సభా ప్రాంగణానికి
కొత్తగా కొంగ్రొత్తగా  సొబగులనద్దారనే చెప్పుకోవాలి.
ముద్దు ముద్దు పలుకులతో ఆ చిన్నారులే సంప్రదాయబద్ధంగా మామిడితోరణాలై నిలిచారు.
మళ్ళీ నన్ను మా బాల్యంలోని వీధిబడి స్మృతులను దివ్య భావ తరంగాలపై తేలియాడుతూ  విహంగ మార్గాన దిగివచ్చి  సొగసుగా శోభాయమానంగా విందు భోజనాన్ని కడుపారా ఆరగించేలా వడ్డించారు.
===========================================

No comments:

Post a Comment