Sunday, March 15, 2015


మూల్యాంకనం
-----------------రావెల పురుషోత్తమ రావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^
అటు ఆ ఆకాశం వైపు చూడు
దిగులు మేఘాలనన్నింటినీ
దిగ దుడుచుకుని నిర్మలమైన
మనసుతో ఎలా మనగలగాలో
మంచితనంతో కల్మషంలేకుకుండా
స్వచ్చ మైన  స్వేచ్చాజీవిగా
ఎలా జీవనం సాగించాలో  ఎరుకవుతుంది[1]

నిరంతరం పారే ఆసెలయేరు వైపు నీ దృష్టిని సారించు
కొండాకోనలమీదనుంచి రాలిపడే జలపాతాలనుకూడా
తనలో విలీనం చేసుకుని ఎలా సమున్నతంగా సాగిపోవాలో
సోదాహరణంగా తెలియబరుస్తుంది. ప్రాణాధారమైన
జలకళతో ఎలా నిత్య సుమంగళిగా నిండు మనసుతో
జీవనం సాగించడం యొక్క విలువను  తెలుసుకుంటూ
పరభాగ్యోపజీవిగా  ఎందుకు బ్రదకరాదో విశదమౌతుంది[2]

అటు తిలకించు
దహనమౌతున్న వనమంతా
దేనికి నిదర్శనంగా నిలబడుతుందో.
అంతరాంతరాళాల్లో
అగాధపు అంచులదాకా వెదుకు!
అట్టడుగునకూడా పేరుకున్న
అహంకారాన్నీ, స్వార్ధం
సంకుచితత్వాలనెలా దహింపజేసుకుని
అగ్నిపునీతుడిగా మేలిమి బంగారంలా
ఎలా వెలికిరావాలో విశదమౌతుంది[3]

కుల మత వైషమ్యాల వలలో
చిక్కుకుని నీ విశాల దృక్పధం
రాను రాను కృంగి కృశించకుండా
అచంచలమైన విశ్వాసంతో
అనంతమైన సహనంతో
 విశాల విశ్వాన్నీ
 తనభుజస్కంధలపైమోసినా
అలుపు సొలుపూ ఎరుగని సహనశీలిగా
ఎలా బ్రదుకు బాటను మలచుకోవాలో
పుడమితల్లి ఎంకు పుణ్యరాశీగా
పదిమందిలోనూ ప్రకాశవంతగా
శోభించగలుగుతుందో
స్పష్టంగా నీకవగతమౌతుంది.[4]

అలాంటి ప్రశాంతంగా వీచే చల్లగాలిని
నీ సుఖాలకోసం కాలుష్యపు కోరల్లో చిక్కించి
వ్యవధానంలేని అస్తవ్యస్తావధానాలకు కారకమై
వర్షాభావాలకు అతివృష్టీ అనావృష్టులకు
కారణభూతమై కడగండ్ల పాలై
సునామీల సృష్టికర్తగా యేం సాధించావో గమనించు.
 పంచ భూతాలనన్నింటినీ పరమ శత్రువులుగా జేసుకుని
నీవు సాధించిన ఘన విజయపరంపర యేమిటో మూల్యాకనం చేసుకో.
నీక్రౌర్యానికీ యావజ్జగతీ ఎలా బలయిందో సరిచూసుకో.

ఇప్పటికయినా పెద్దలందిచిన ప్రసాదాన్ని పరహితార్ధమై
ప్రయోజనకారిగా మసలేలా ప్రణాళికలు రచించుకో
ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని
అందుకునే   అర్హతను సంపాదించుకో[5].
=======================================14-3-15

No comments:

Post a Comment