Thursday, March 26, 2015

అమృతం కురవని రాత్రి
=======================

అమృతం కురవని రాత్రి
మాఇంట్లో 'రాత్రి'   ముభావ ముద్రను నర్తించింది.
మేమిద్దరం అంత దగ్గరగా మసులుతున్నా
కలల సామ్రాజ్యంలో విహరించడానికే
కాలమంతా ఖర్చయిపోయింది.

ఆమె వదనారవిందమంతా చిరాకునే 
చిన్మయ జ్యోతిగా వెలిగించింది.
ఏప్పుడో నెలలక్రితం వదరిన నా వసపిట్ట వాక్యాలను
తలచి తలచి దు:ఖ సముద్రంలో స్నాతగా తన్ను నిలిపింది.

అర్ధరాత్రయితే అయిందిగాని ఆమె అమృతఘడియలను
వర్జించడానికే నిశ్చయించుకున్నట్లు భావించవలసి వచ్చింది.
నింగిపై నిర్మల హృదయుడై వీక్షిస్తున్న నెల బాలుడు
తన దయా వృష్టిని వర్షించకుండానే చిత్తగించడం
ఖాయమయేలా వున్నదన్న సత్యం నన్ను
ఉద్వేగానికి గురిచేసి ఉరకలెత్తే నా ఉత్సాహానిపై నీళ్ళు జల్లుతున్నట్లుగా తోస్తున్నది.

మరలా మరో రాత్రిదాకా ఈ అమృతోపమయిన ఘడియలకోసం
చకోరపక్షిలా మూగ సందేశాలతో ఉడుకులెత్తే ఉష్ణోగ్రతను
చల్లబరుచుకోక తప్పదనే  ఆ దిన ఫలం సూచించినదే
ఋజువవడం తప్పదులాగున్నది.వసంతంలో కొన్ని రోజులు
ఇలా వృధా అవడం ప్రకృతి మాతకు కంటగింపుగా మారకూడదనే
నేను మనసారా నా విన్నపాలు వినవలెనని 
ఆ మన్మథవిభావరిని   అభ్యర్ధించే వింత ప్రార్ధన.
=============================================


No comments:

Post a Comment