Thursday, March 19, 2015

విశ్వాసం నూరిపోయండి
-----------రావెలపురుషోత్తమరావు.
రాయిలా,రప్పలా
ఎంతకఠినత్వాన్ని
గుండెలోపేర్చుకుని
 ఓ  జడపదార్ధంలా
మానవుడు మారిపోతున్నాడు
అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ
ఆందొళనాపధంలోకి నెట్టేస్తున్నాడు.

ఒకప్పుడు దయార్ద్రహృదయుడుగా
వెన్న పూసలాంటి మనస్సుతో
యేచిన్న సందర్భంలోనయినా
ఇట్టే కరగి కరుణా సముద్రుడిగా
ప్రత్యక్షమై పరహితం కోసం
ప్రాకులాడిన మనిషి ఎందుకిలా
ఉద్విగ్నుడై ఉసురుసురంటూ నీరుగారిపోతున్నాడు?

రాజకీయ భస్మాసురిడి కబంధ హస్తాల్లో
కన్నీటిజాలును ఇంకింపజేసుకున్నాడా?
సాహిత్యపు గుబాళింపులకు దూరంగా జరిగి
సజ్జన సౌందర్యపు సౌశీల్యాన్ని
సమూలంగా సమాధి స్థితికి దిగజార్చుకున్నాడా?
ఎందుకిలా మనిషి మ్రానులా స్పందన రాహిత్యంలో
కొట్టుమిట్టులాడుతూ మృతజీవుడిగా దర్శనమిస్తున్నాడు
జీవన్మృతుడుగా జాతిమొత్తంచేతా చీదరించుకోబడుతున్నాడు?
ఇతన్నీ మళ్ళీ ఋజుమార్గంలోకి మరల్చే మార్గం లేదంటారా?
అతని అవసరమయితే కవితారసాయనాన్ని
పాత కొత్తా బేధంలేకుండా జరూరుగా నరలలో
కొంగ్రొత్తగా ఉత్సాహం ఉద్వేగం పొంగి ప్రవహించేలా
రబ్బర్గొట్టాలద్వారా ముక్కులకున్న రంధ్రాలద్వారానో
నోటి ద్వారానో గుండె కవాటాలకు శీఘ్రంగా చేరుకునేలా
చివరాఖరు ప్రయత్నం చేయండి! అతడిలో తప్పక
చలనంకలుగుతుందన్న గట్టి నమ్మకం నాకుంది.
నన్ను నమ్మండి! నా నమ్మకాన్ని వమ్ముకానీయకండి.
శుభం భూయాత్!!
==========================================

No comments:

Post a Comment