Thursday, March 5, 2015

ఊరెరిగింపు
-------రావెలపురుషోత్తమ రావు.

కవిత్వం సుదీర్ఘ స్వప్నమనుకుంటే
చదువరిగానీవు కుంభకర్ణుడిగా మారకూడదు.

కవిత్వం కమ్మని కలగా భావిస్తే
అందులో ఊయలలూగే పాపాయివి నీ వు కాకూడదు.


కవిత్వమంటే చైతన్యదీపం,అది యుగ యుగాలకూ శుభసందేశమవాలి.
చుట్టూ అలముకున్న తిమిరంతో సమరంచేసే దాశరధివి నీవు కావాలి.


అధోజగత్సహోదరుల ఆలనా పాలనా కనిపెట్టి నీ తీరును
మహాప్రస్థానం వైపు సాగించే శ్రీరంగం నీవై ప్రభవించాలి.

అగ్ని జల్ల్లినా అది అమృతంకురిసినా అందం గా ఆనందంగా
గుండెలకు హత్తుకుపోయే బాలగంగాధర తిలక్ వు నీవే కావాలి.



పుట్టుమచ్చలను పట్టి చూపించగల ఖాదర్ భాయ్ వు నువ్వే కావాలి.
నదీ మూలాలను మరువని నా జాతికీ నవోన్మేషమైన
దారులవెంట యువ గళాలనూ కలాలనూ నడిపించే యాకూబ్ వి కావాలి.

ఇంటింటికీ కవిత్వ రసాయనాన్ని  సీసాల్లో భద్రపరచి అమ్మి
మన ఆరోగ్యం మనచేతుల్లోనే వుందనీ ఓ మంచి కవితా సంపుటి ప్రక్కన
మనసెంతో నులివెచ్చన అంటూ గుబాళించేలా ప్రసరించే
సాదిక్ ఆలీవై శోభించాలి కవితాతారాగణంతోపాటు
 నువ్వు వెలిగివెన్న్నెల్లా హృదావిష్కరణ గావించుకోగలగాలి.

అప్పుడే కవితామతల్లికి నీవు మాతౄ ణం తీర్చుకోగలిగినట్లు
జయజయ ధ్వానాలతో కవిత్వాన్ని పాఠకుల హృదయమనే పల్లకీలో
ఊరేగించినట్లు ఊరంతా కవిత్వపు దీధితులను నిరంతరం ధగద్ధగాయమానంగా  పంచినట్లు.
*****************************************************************





No comments:

Post a Comment