Monday, March 9, 2015

 పడవలో----
++++++++++++++++++++++++++

ఆటుపోటుల మధ్యన
పడవప్రయాణం
దూరంగా రేరాణి పూల
సౌరభంపు గుబాళింపు.

సుళ్ళుతిరుగుతూ సరంగు గాలిపాట
మనోనేత్రాల్లో పరిసరాల
అందాలను నిక్షిప్తం
 చేసుకోవాలన్న తపన.
క్షణాలను పరుగెట్టిపొమ్మని స్వాసిస్తూ.

ప్రవాహంలా పరుగెడుతున్నది.
పడవంతటా కిక్కిరిసి ఇంటిముఖం
పట్టి తిరిగొచ్చే శ్రమ జీవన సౌందర్యం
పగలంతా వెలార్చిన  స్వేదం
చుట్టుకుపోతూ నాసికా పుటాల చెంత
పరిభ్రమిస్తున్నది సరిలేరునాకెవ్వరని.
కుదుపుల్లోనే ఖుషీ ఖుషీ గా నవ్వులపువ్వులు.
గోదారమ్మ అందాల మాటెలా వున్నా
జానపదం జాణయై నర్తిస్తున్నది.
చీకటికి స్వాగతం చెప్పగల గుండె నిబ్బరం
పడవంతటా పదిలంగా పరుచుకుని పోతున్నది.



పడమటికొండలవైపు ప్రస్థానం
 కొనసాగిస్తూ పగలంతా
చెమటోడ్చి శ్రమించిన సూర్య భగవానుడు.
తన అందాలనన్నింటినీ నదీ ముఖంలో
ప్రతిబింబింపజేస్తూ.
దూరంగా ఊరంతటినీ కలిపి కుట్టిన దీప కాంతులు.
నావ ఒడ్డుకు చేరుతుండగానే మూటా ముల్లే పలుగూ పారలతో
హడావుడిగా దిగాలనుకుంటూ తొందరపడుతూ
అవతలవారిని అదలాయిస్తూ అణుమాత్రమైనా
ఓపిక బిగబట్టుకోలేని ఊపిరి సలుపడంకూడా సైపనోపని
దైనందిన జీవన యాత్రికులు.


***********************************************


No comments:

Post a Comment