Tuesday, March 3, 2015

నిరామయంగా-------
===============
అర్ధరాత్రో అపరాత్రో
ఓ కలొచ్చి కంగారుపెట్టి
ఉలిక్కి పడేలా చేస్తుంది.
చుట్టురా చిన్న దీపపపు
కాంతి చుట్టూ పరిభ్రమించే
చీకటి తనూ భయపడి
నన్నూ భయపెట్టాలని
తనకు తోడుగా భీతవహమై
నేనుకూడా ఉండాలని ఆరాట పడుతుంది.

గాజు కిటికీలోంచి తొంగిచూసే చందమామ
తనకేం తెలియదు సుమా అన్నట్లు
చిరునవ్వులతో ఈ చిన్న విషయానికే
ఇంత వెఱపా అన్నట్టు ఎగతాళి చేస్తున్నాదు.

గట గటా కూజాలోంచి నీళ్ళు
ఒ గ్లాసునిండా వంచుకుని తాగేసాను.
సంవత్సరంక్రింద నన్ను ఒంటరిగా వదిలేసి
తన దారి చూసుకుని పరలోకాని పయనమై
వెళ్లిన సహధర్మ చారిణి సపర్యలు చేస్తున్నట్లు కల.

ఒడలంతా వెచ్చగా ఉందేమిటని అప్పుడర్ధమయింది.
భౌతికంగానే నే ను దూరమయానండీ! మానసికంకాదుగదండీ
కష్ట సుఖాలలో తొడూ నీడగా ఉండడం తప్పా అండీ?
అన్న ఆ ప్రేమామృత వర్షిణికి చెప్పాల్సిన సమాధానం
అశ్రునయనాలెనని అప్పుడే అర్ధమయింది.గుండె చెరువవడమంటే
ఇదేనేమో నని పదే పదే తలచుకుని తలొంచుకుని మళ్ళీ
 కలత నిద్రకు నెమ్మదిగా స్వాగతంపలుకుతూ ఒళ్ళుమరచి

పెదాలనంటిపెట్టుకుని వదలనన్న చిరునవ్వు సాయంతో
మరలానిద్రాదేవత ఒడిలోకి నిరామయంగా జారిపోయాను.
--------------------------------------------------------------------------------

No comments:

Post a Comment